Saturday, September 11, 2010

TEJA MENNENI: ART OF LIVING

ఆనంద పరీమళం

- డాక్టర్‌ అద్దంకి శ్రీనివాస్‌
ఏ ఒక్కరి జీవితమూ పుడుతూనే పూలబాటకాదు. ధనం ఉన్నా లేకున్నా విద్య ఉన్నా లేకున్నా రూపం ఉన్నా లేకున్నా ఏ స్థితిలోనైనా ఆ స్థితికి తగిన ఇబ్బందులు అవి తెచ్చే దుఃఖాలూ ఎంతో సహజాతిసహజం. మానవుడు పుడుతూ ఏదీ నేర్చుకోడు. అన్నీ పెరుగుతూనే నేర్చుకొంటాడు. ఈ క్రమంలో అలా నేర్చుకొనే వాటిలో ఏవి ఆనందాన్నిస్తాయో ఏవి దుఃఖాన్నిస్తాయో తెలుసుకోలేక తికమకపడి సరిగ్గా కష్టాల్ని కొనితెచ్చిపెట్టే అలవాట్లను ఇష్టంగానూ, నిత్యానందాన్ని అందించే అలవాట్లని కష్టంగానూ భావిస్తాడు. కొన్ని ఉదాహరణల్ని చూస్తే ఈ విషయంలోని లోతు ఇట్టే అర్థమవుతుంది.

ఎవరైనా సరే నిత్యం ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలి?
మనల్ని నిత్యం కలవరపెట్టే విషయాలనుంచి దూరంగా ఉండటం మంచిది.
1. ఎప్పుడూ ఎవరినీ ద్వేషించకుండా ఉండాలి.
2. ఎప్పుడూ మనసును ఆందోళనలకు దూరంగా ఉంచాలి. కంగారు పడకూడదు.
3. నిరాడంబర జీవనం సాగించాలి.
4. తక్కువ ఆశించాలి.
5. ఎక్కువ త్యాగం చేయాలి.
6. ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండాలి.
7. తీరిక సమయాల్లో- నచ్చిన, నమ్మిన భగవన్నామస్మరణ చేయాలి.

ఈ ఏడు అలవాట్లు పైకి మామూలుగా కనిపించినా, ఎప్పుడూ ఎవరికీ నిత్యంగా లభించని ఆనందాన్ని పట్టితెచ్చి మన అరచేతిలో ఉంచుతాయి. ఎందుకంటే, ఎప్పుడైనా మనం అదుపు తప్పేది ఒకరిపై ద్వేషం పుట్టినప్పుడే. ఎవరేం చేసినా నేను ఎవరినీ ద్వేషించనని ముందే మనసులో మనం ఒక స్థిర నిర్ణయానికి వస్తే- ద్వేషంవల్ల వచ్చే ప్రతీకార వాంఛ, క్రోధం వంటి దుర్గుణాల్ని నిరోధించవచ్చు. ద్వేషాన్ని రూపుమాపుకొన్నవాడే తన ప్రియభక్తుడని కృష్ణభగవానుడే చెప్పాడు. ఇక ఆందోళనలకు కారణం మనస్సు. మానవుని బంధనానికిగానీ, జీవన్విముక్తికిగానీ కారణం మనసే. ఆ మనసు అతి చంచలమైనది. సత్కర్మాచరణ, ధార్మికనిష్ఠ సత్కథాకాలక్షేపాల వంటి నియమిత కర్మలను నిరంతరంగా ఆచరించడం ద్వారా మనసు తాలూకు వక్రబుద్ధిని సరిచేసుకోవచ్చు. ఆడంబరాలు మనసును కలుషితం చేస్తాయి. జగత్తులో సర్వమూ మిథ్య అనే వేదాంతం ఆడంబరాల్ని రూపుమాపుతుంది. దర్పం, అహంకారం వంటి దుర్గుణాలకు గొడ్డలిపెట్టు నిరాడంబరత్వం. ఆశ మనల్ని దాసుల్ని చేసి ఆడిస్తుంది. సాధ్యమైనంత తక్కువ ఆశించాలి. మనం దేన్నైనా ఆశించడం మొదలుపెట్టామా? దుఃఖంలోనికి దిగుతున్నట్లే లెక్క. ఆశించినదే ఎల్లప్పుడూ దక్కదు కదా! అప్పుడు దుఃఖమూ తప్పదు. అందుకే మొదటినుంచీ పుచ్చుకోవడంలోకన్నా ఇవ్వడంలో ఎక్కువ ఆనందం ఉందనే భావనను అలవరచుకోవాలి. ఒక్కసారి ఆ ఆనందంలోని మాధుర్యం చవిచూస్తే ఎప్పుడూ మనసు 'ఆశ' జోలికిపోదు.

ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి. హృదయం నిర్మలంగా ఉన్నప్పుడే ఇది సాధ్యం. సాధ్యమైనంత వరకూ హృదయహాసాన్ని నిత్యం ధరిస్తే, ఆ హాస్యం ముఖంలో ప్రతిబింబిస్తుంది. ఆ మనోల్లాసమే ఇతరుల హృదయ వికాసానికి దోహదం చేస్తుంది. ఈ లక్షణాలన్నీ సాధించాలంటే మానవుని మానవునిగా చూస్తే సరిపోదు. ప్రతి జీవిలోనూ దివ్యత్వం, దైవత్వం ఉన్నట్లు భావించాలి. సృష్టిలో ఏ ప్రాణిని చూసినా దైవస్వరూపంగా తలపోయాలి. అప్పుడే నిత్యానందం కరతలామలకమవుతుంది. ప్రయత్నపూర్వకంగా సాధించిన ఈ ఆధ్యాత్మిక సుమ పరీమళం లోకమంతా వ్యాపించి ఆనందం అందరికీ అందుతుంది.

No comments:

Post a Comment